పేజీలు

18, సెప్టెంబర్ 2011, ఆదివారం

మనసున  మల్లెల మాల లూగించి...
ఆంతర్యాన్ని ఆర్ధ్రతతో నింపి..
భువి నుండి దివికి తీసుకెళతా వనుకుంటే..
మనసున మహరణ్యాలు మండించి..
ఆంతర్యాన అగ్ని పర్వతాలు రగిల్చి..
దివి నుండి భువికి
అమాంతంగా పడేసావెందుకు  ప్రభూ..!
మమతల మందిరం అలికి ముగ్గులు పెట్టి..
కోర్కెల గుమ్మానికి ఆశల తోరణం కట్టి..
కోటి దివ్వెల వెలుగులా..నీవు వస్తావని..
నేనిలా మిగిలి వున్నాను నీకోసం..
ఆశా నిరాశల మధ్య నలిగిన రోజుల్ని మరపిస్తావని..
ఆవేదనలతో రగిలిన హృదయాన్ని మురిపిస్తావని..
సంఘర్షణలతో..సతమత మవుతున్న సంఘటనలకు
ఆహ్లాద మైన ముగింపు నిస్తావని..
నిర్వేదంతో నిరంతరం తల్లడిల్లు తున్న జీవితంలో..
అందమైన మార్పును తెస్తావని..
నేనింకా..నీకోసమిలా..
ఎదురు తెన్నులు చూస్తూనే వున్నా..
ఈ మనసనే తీగకు మమతల మారాకులు తొడిగి..
మార్ధవపు మలయ మారుతంతో..
ప్రేమ సౌరభాన్ని గుండెల్లో పరుస్తావని..
ఆవేదన కోరని ఆకాంక్షల తో..
ఆవేశము నెరుగని ఆశలతో..
ఆర్తి సోకని ఆనందంతో..
అపురూపంగా ఈ జీవితమంతా నీతో గడపాలన్న అనురక్తితో
ఆహ్లాదం నిండిన మనసుతో..
ఆహ్వానిస్తున్నా నిన్ను నా కలల ప్రపంచం లోకి..
వచ్చేయ్ ప్రియతమా..
వినూత్న పధంలో నను నడిపేందుకు...!