పేజీలు

29, సెప్టెంబర్ 2011, గురువారం

అమృతానుభూతి..

ఏ నైరూప్య స్వప్నాల లో నుండి ..ఏ అదృశ్య స్వర్గాల లో నుండి ..
ఏ పారిజాత పరిమళ పవనాల మీద నుండి..
ఏ పాలపిట్ట స్వర ఝరీ తరంగాల మీద నుండి..
దిగి వచ్చావో న దరికి ..ఆనంద లహరుల అమృతానుభూతివై..!
నా గుండెల గాజు కుండీలో ఈదే గోల్డ్ ఫిష్ వి..
నా ఊహల ఆల్మైరా లో ఊపిరి తీసే కృష్ణ శాస్త్రి గేయ సంపుటివి..
నా తలపుల గేలరీ లో వ్రేలాడే నికోలస్ రోరిక్ హిమాలయ చిత్రానివి..
నా జ్ఞాపకాల పియానో మెట్లపై నాట్య మాడే బీధోవెన్ స్వర కల్పనవి..
నా భావ లతాగ్రాన విరిసే పుష్పాలనీ..
నా నయనాంచలాల మెరిసే భాష్పాలని..
కలల దారాలకు కలిపి కూర్చి..
కమనీయ కవితా మాలికలుగా తీర్చి..
నీ మేడలో వేయనీ..
నీ ఎదపై నా హృదయ స్పందనంతో సంతకం చేయనీ...
నా ఏకాంతపు చీకటిలో ..
నీ స్వరమే భాస్వరమై జ్వలించనీ...!

కామెంట్‌లు లేవు: